గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మతో సహా మొత్తం 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని అందరు మంత్రుల రాజీనామాలు ఆమోదించబడ్డాయి. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుజరాత్ కొత్త మంత్రివర్గం ఏర్పడనున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. మరోవైపు ఐదారు మంది మంత్రులకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తున్నది. మిగిలిన పదవులను కొత్తవారితో భర్తీ చేయనున్నారు.


