టాలీవుడ్ కొత్త జంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనలకి స్పెషల్ సర్ప్రైజ్ని ఇచ్చారు రణబాలి మేకర్స్. వీరిద్దరూ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. ఈ సినిమాలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వీరికి చిత్రబృందం స్పెషల్ సర్ప్రైజ్ని ఇస్తూ, చిత్రంలోని రొమాంటిక్ మెలోడీ ఎందయ్య సామి పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. తెలుగులో ఎందయ్య సామి, తమిళంలో ఎదయ్యా సామి, హిందీలో ఓ మేరే సాజన్ అంటూ ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (మమ్మీ ఫేమ్) కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


