భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(60) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచే ఇది అమలులోకి వచ్చిందని నాసా పేర్కొంది. మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ మార్గదర్శకురాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన సేవలు చంద్రుడు, మార్స్‌పై భవిష్యత్తులో చేయబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయి. అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. నీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఆమె పనిచేశారు. మొత్తం మూడు మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి, అత్యధిక రోజులు స్పేస్‌లో గడిపిన అమెరికన్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. బుచ్ విల్మోర్తో కలిసి 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. మొత్తం తొమ్మిదిసార్లు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ కోసం 62 గంటల 6 నిమిషాలు గడిపారు. మహిళా వ్యోమగాముల్లో ఇదే అత్యధికం. అంతరిక్షంలోనే మారథాన్ చేసిన తొలి వ్యక్తిగానూ సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు.


