ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సవరణపై దురదృష్టకరమైన విమర్శల ఆట కొనసాగుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది. ఎస్ఐఆర్లో అభ్యంతరాలు, వివాదాలను జ్యుడిషియల్ ఆఫీసర్లు పరిష్కరిస్తారని పేర్కొంది.
రాజ్యంగ బద్ధ వ్యవస్థలైన రాష్ట్రం, ఎన్నికల కమిషన్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ అభ్యంతరాలు, వివాదాల మధ్య చిక్కుకుంది అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కోసం పనిచేస్తున్న జిల్లా జడ్జి హోదాలో ఉన్న మాజీ న్యాయాధికారులను కూడా ఈ ప్రక్రియ కోసం నియమించాలని, అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయాధికారుల నియామకం, బాధ్యతలకు సంబంధించి సమగ్ర ప్లాన్ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో శనివారంనాడు సమావేశం కావాలని ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీ, పోలీస్ చీప్, ఇతర ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.


