హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భారీఎత్తున హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్టు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. హెచ్-1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.అయితే ఈ ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నారుమెన్ వెల్లడించారు. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ, తదుపరి వీసా అపాయింట్‌మెంట్ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది అని ఎమిలీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.


