తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటుందని అనుకున్నప్పటికీ, కొంత తగ్గిందని కేటీఆర్ అన్నారు. హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయించి బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని తెలిపారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని వివరించారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.


