ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు రేవంత్‌రెడ్డి. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, ఆటోడ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొట్టి తమ మీదకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తుచేశారు. మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి పాలమూరును ఆదర్శంగా మారుస్తామని వివరించారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ఇరిగేషన్‌తో పాటు ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పేద బిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు ప్రారంభించామని తెలిపారు.


