గ్రూప్ -2 పోస్టులకు 2019లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెలువరించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం, తుడిచివేతలున్న పార్ట్-బీ పత్రాలను పునఃమూల్యాంకనం చేయడం చెల్లదని హైకోర్టు తీర్పులో పేరొంది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగినట్టు కనిపిస్తున్నప్పుడు వాటిని పకన పెట్టకపోవడం సర్వీస్ కమిషన్ తప్పిదమని స్పష్టం చేసింది. కమిషన్ 24 అక్టోబర్ 2019లో ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని తేల్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఆ తరువాతనే అర్హుల అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసి తాజాగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని చెప్పింది. జవాబు పత్రాల దిద్దుబాటు, వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ జరిపినవాటిని మూల్యాంకనం చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు.


