గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిమీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని అన్నారు. 2014 లో పాలమూరు- రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, వరుసగా మూడు సార్లు ప్రధాని అయినా, ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు ప్రచారానికి వచ్చి, మొండిచేయి చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారానికి వచ్చారని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కోసం హామీ ఇస్తాడని అనుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. గత జిహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తాం, ఇళ్లు పోతే ఇళ్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారని, ఇన్సూరెన్స్ ఉన్నదానికి బండిసంజయ్ రెకమండేషన్ ఎందుకు? అని 12 ఏళ్లుగా మీరు చేసిన మోసాలు చాలదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడొచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయని, యూపి రూపాయి చెల్లిస్తే కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయిలు తిరిగి ఇస్తుందని, బిహార్ రూపాయి చెల్లిస్తే, అక్కడ ఆరు రూపాయిలు తిరిగి ఇస్తున్నారని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇస్తున్నారని, ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాట్లాడారా? అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని తెలియజేశారు. ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ లు అవసరం లేదని, 8 మంది ఎంపిలను గెలిస్తే, మీరు రాష్ట్రానికి చేసిందేమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు అని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసి ఉత్తరాదికి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికేనా? అని ప్రశ్నించారు. పైగా యూపిఎ హయాంలో ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేశారని పేర్కొన్నారు.


