గన్నవరం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఉడాన్ యాత్రీ కెఫేను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉడాన్ యాత్రీ కెఫేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కెఫేలో కాఫీని ఆయనే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికుల అభిప్రాయాలను కేంద్ర మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఇలా కాఫీని అందుకోవడం ఆనందంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విమానాశ్రయం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో కలిసి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. 10 ఏళ్ల క్రితం దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ఇన్ని విమానాశ్రయాలు ఉండడం వల్ల, చిన్న పట్టణాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగామని పేర్కొన్నారు. పట్టణాలకు సైతం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల సామాన్యులు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు.


