పురుషుల అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు టైటిల్ పట్టేశారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు ఆరో టైటిల్ కట్టబెట్టారు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసక శతకంతో విరుచుకుపడగా, బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అంబ్రిష్(3-56) విజృంభించగా100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 174కే ఏడు వికెట్లు పడినా, టెయిలెండర్ ఫాల్క్‌నర్(115) వీరోచిత సెంచరీ బాదినా సరిపోలేదు. కనిష్క్ ఓవర్లో ఖిలాన్ పటేల్ డైవింగ్ క్యాచ్ అందుకోగా ఆరోసారి అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా.
టాస్ గెలిచిన భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) వీరకొట్టుడుకు ఆయుష్ మాత్రే(53), అభిగ్యాన్ కుందు(40) మెరుపులతో 411 పరుగులతో ఇంగ్లండ్‌పై మానసికంగా పైచేయి సాధించింది. కొండంత స్కోర్ కొట్టిన టీమిండియాకు ఛేదనలో ఇంగ్లండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాపార్డర్ విఫలమవ్వగా ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కానీ, టెయిలెండర్లు అసమాన పోరాటంతో భారత బౌలర్లను విసిగించారు. కానీ, అంబ్రిష్(3-56), కనిష్క్(2-63), దీపేశ్(2-64) అద్బుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు.


