గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖ పట్నంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం అవుతుందని అన్నారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని, టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని అన్నారు. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నామని అన్నారు. 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నామని అన్నారు. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని అన్నారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ , గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. 522 మంది విదేశీ ప్రతినిధులు, 72 దేశాల నుంచి ప్రతినిధులు, 2,500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లు పాల్గోన్నారు.


