రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ వండర్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు. అరకు కాఫీ అనగానే గుర్తొచ్చేది విశాఖేనన్నారు. విశాఖ ఆతిథ్యం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలో తొలి స్థానంలో ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య రాష్ట్రంలో విశాఖలోనే ఎక్కువగా ఉందని తెలిపారు.
భారతదేశం ఐటీ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయుడేనని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ త్వరలో విశాఖలో ప్రారంభం కానుందని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనే లక్ష్యంతో లాజిస్టిక్స్‌పై దృష్టిపెట్టామని సీఎం పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్, గ్రీన్ హైడ్రోజన్, తదితర ఆధునిక ప్రాజెక్టులపైనా ఏపీ దృష్టి సారించిందని వివరించారు.


