నదుల అనుసంధానం చేస్తే నీటి సమస్య తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం కావాలని అన్నారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు ప్రసంగించారు. నదుల అనుసంధానం చేసి తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదేనని, 2014-19 మధ్య రూ. 63 వేల కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు దశ, దిశ చూపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని, రాష్ట్రంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా టిడిపి కట్టిందేనని కొనియాడారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని, గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. తమ కుప్పంకు కూడా నీళ్లు ఇస్తున్నామన్నారని, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదని తెలియజేశారు. పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, నాగావళి, చంపావతి, జంఝావతి ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లల్లో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని, రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గొచ్చునని, మే 12న నారుమళ్లకు నీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.


