కామారెడ్డి లో కాంగ్రెస్- బిజెపి నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు వెంకటరమణారెడ్డి బయలు దేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిముందు పోలీసులు బందోబస్తు ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు కబ్జాకు గురవుతున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం ఆక్రమించినా రాజీనామా చేస్తానని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్ టిఐ కింద కాలేజీ భూముల వివరాలు అడిగానని, పూర్తి వివరాలు వచ్చాక, అందరి సంగతి చూస్తానని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు.


