ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా పేరొందిన మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్స్క్రైబర్లు దాటిన తొలి క్రియేటర్‌గా నిలిచాడు. 2026 జూన్ 12న మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో 50 కోట్ల సబ్స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్ చరిత్రలో ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు. కాగా మిస్టర్ బీస్ట్ ఫిబ్రవరి 2012లో తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. అప్పుడు అతడి వయసు 13 ఏళ్లు. 2017లో అతడు అంకెలను లక్ష వరకు లెక్క పెడుతూ చేసిన వీడియోకు విస్తృత ప్రజాదరణ లభించింది. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ డోనాల్డ్సన్. అతడు తన బీస్ట్ ఫిలాంత్రపీ ఛానల్ పైన వచ్చే మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తుంటాడు. చెట్లను నాటడం, సముద్రాల శుభ్రత, పేదలకు ఇళ్లు, ఆహారం అందించే ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతుంటాడు.


