ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసిపోయే అత్యుత్తమ డిప్లొమాట్స్ భారతీయులే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్-2026 కు ఆయన హాజరై సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు అందిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువుగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేకించి ఐటీ సహా వివిధ రంగాల్లో గ్లోబల్ కమ్యూనిటీ, ప్రపంచ సంక్షేమానికి భారతీయులు విస్తృత సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీలాంటి చోట్లకు మేధో వలసలు జరిగాయని, కానీ త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ఆయన తెలిపారు.
నిపుణులు, వనరులు ఉన్న చోటికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నారు. దూరాలు ఇక అడ్డంకి కాదని, ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడైనా పెద్ద కంపెనీని ప్రారంభించి పనిచేసే అవకాశాలున్నాయని తెలిపారు. త్వరలో డేటా సెంటర్‌ల కోసం గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భారత్‌లో ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్సఫర్మేషన్ జరుగుతోందని చెప్పారు. త్వరలో విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్ అమ్మోనియా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏఐ, క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్‌లో పెద్ద అవకాశాలున్నాయన్నారు. ఇటీవల ట్రైనింగ్ కోసం పిలుపు ఇస్తే 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కు పెంచేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించామని తెలిపారు. మూడో బిడ్డ పుడితే రూ.25వేల ఆర్థిక సాయం, నెలవారీగా రూ.వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని వివరించారు.


