కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు.ఫ్రీ బస్‌పై కేటీఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో మహిళల వడ్డీ లేని రుణాలు రూ.3 వేల కోట్లు బాకీ పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు రూ. 1121 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలపై రూ.3000 కోట్ల భారం పెట్టిపోయిందన్నారు. కేటీఆర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటూ సీతక్క పేర్కొన్నారు.


