పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తంచేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా తాము స్వీట్లు పంచుతామని చెప్పారు. బెంగాల్లో రెండు విడతల ఎన్నికల పోలింగ్లో భాగంగా తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రధాని ప్రచారం చేస్తున్నారు. నదియా జిల్లా లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ భారీగా జరిగిన ప్రాంతాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు. ఈసారి భారీగా పోలింగ్ జరుగుతున్నదని, బీజేపీ గెలుపు ఖాయమని చెప్పారు. మే 4న బీజేపీ చరిత్ర సృష్టించనుందని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా మిఠాయిలు పంచి వేడుక చేసుకుందామని సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీని ఓటర్లు సాగనంపబోతున్నారని అన్నారు.


