గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు, చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన తాగునీటి ట్యాంకర్‌ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి, పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75 వేల విలువైన వీడ్ వాకర్‌ను (వ్యవసాయ పరికరం) విరాళంగా అందించారు.
తాగునీటి ట్యాంకర్, వాటర్ డిస్పెన్సర్‌ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సమష్టిగా ప్రారంభించారు. పీ-4 స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ట్యాంకర్ ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.


