ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్ పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. చైనా అధ్యక్షతన జరిగిన యూఎన్‌ఎస్‌సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ పాకిస్థాన్ చేసిన ఆధారరహిత ఆరోపణలను తిప్పికొట్టారు.
స్వతంత్ర భారతదేశం ఏర్పడిన నాటి నుంచి నిత్యం సరిహద్దు ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతోందని హరీశ్ పర్వతనేని అన్నారు. చట్టబద్ధంగా, తిరిగి మార్చలేని విధంగా భారత్‌లో విలీనమైన భూభాగాలను ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉందని ఆయన చారిత్రక వాస్తవాలను గుర్తుచేశారు. భారత్‌ను వెయ్యి గాయాలతో రక్తమోడించాలనే పాకిస్థాన్ సిద్ధాంతం, వారి డొల్ల మాటలను బట్టబయలు చేస్తోందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని స్పష్టంచేశారు. తన చర్యలకు పాకిస్థాన్ తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.


