కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడం వెనుక రాష్ట్రంలోని ఆ పార్టీ నేత హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉన్నట్లు తెలంగాణ నుంచే తమకు సమచారం అందిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రే చెప్పారని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ కేసును బీజేపీ మంత్రికి లీక్ చేసింది ఎవరని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ కేసును లీక్ చేసింది ఎవరనే దానిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్), జ్యుడీషియరీ ఎంక్వైరీ వేస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చెప్పిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదని విమర్శించారు. అందుకే ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ మంత్రికి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఉన్నారని చెప్పారు.


