అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అంటూ పదేపదే ప్రకటించే అమెరికా, జీ7 సమావేశాల వేళ గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ తన అసలు పేరు యూఎస్ పపిఫిక్ కమాండ్‌కు అధికారికంగా తిరిగి మారుతుందని అమెరికా యుద్ధ శాఖ ప్రకటించింది. తద్వారా ఏడు దశాబ్దాలకు పైగా ఈ సైనిక విభాగం పనిచేసిన ఆ పాత పేరును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన కార్యకలాపాల పరిధికి సంబంధించి ఆ కమాండ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో భారతదేశానికి చెందిన తప్పులతడకల మ్యాప్‌ను కూడా ప్రదర్శించింది.
యూఎస్‌పీఏసీవోఎం వెబ్‌సైట్ తన బాధ్యతాయుత ప్రాంతం మ్యాప్ విభాగంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించింది. ఫ్రాన్స్‌లో జీ7 దేశాల నాయకుల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న తరుణంలోనే అమెరికాకు చెందిన ఇండో-పసిఫిక్ కమాండ్ తన పేరును తిరిగి అమెరికా యూఎస్ పసిఫిక్ కమాండ్‌గా మార్చుకుంది. 1947లో అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ హయాంలో ఈ కమాండ్ ఏర్పడిన నేపథ్యాన్ని గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొన్నది.


