తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది. రాష్ట్రంలో నూతన విద్యా విప్లవానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అంతర్జాతీయ విద్యా హబ్‌గా మార్చేందుకు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. మైసూరు కేంద్రంగా విద్యాసేవలు అందిస్తున్న ప్రతిష్టాత్మక జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎస్ఎస్) మహావిద్యాపీఠం, తమ నూతన ఆఫ్-క్యాంపస్‌ను తిరుపతిలో నిర్మించనుంది. అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎస్ఎస్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం అధికారికంగా కుదిరింది. ఈ ఒప్పంద ప్రక్రియలో భాగంగా ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేఎస్ఎస్ విద్యాసంస్థల ప్రో ఛాన్స్లర్ డా.బి.సురేష్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.


