ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. సాయికృష్ణ తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బోడెప్రసాద్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ సాయికృష్ణ తల్లి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడించారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
సాయికృష్ణపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే సాయికృష్ణ మిస్సయ్యాడంటూ పోలీసులు చెబుతున్నారు. పోలీసులే సాయికృష్ణను హతమార్చారని, లాకప్ డెత్ కింద కేసు నమోదు చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాడంతో పాటు, ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించింది.


