హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఈ కీలక పరిణామంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు భారత సైన్యానికి (ఇండియన్ ఆర్మీ) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అనుమతి రావడం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక మైలురాయి అని సీఎం పేర్కొన్నారు.


