తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్షపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్‌లో పేర్కొన్నవి అస్పష్టమైన ఆరోపణలు మాత్రమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. మే 13న అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన తన సంఖ్యాబలాన్ని సీఎం విజయ్ నిరూపించుకున్నారు. వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎమ్ఎల్ పార్టీలు టీవీకే అధినేత విజయ్‌కు మద్దతు పలికాయి. 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా టీవీకే అధినేత విజయ్‌కు అండగా నిలిచారు. డీఎంకే మాత్రం వాకౌట్ చేసింది. ఈ క్రమంలో సీఎంకు సభలో మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల సంఖ్య 120కు చేరింది. మేజిక్ ఫిగర్‌కు అదనంగా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును సీఎం సాధించారు. అయితే, బలపరీక్షలో అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా ప్రతిపక్షం ఆరోపించింది.
ఈ నేపథ్యంలో బలపరీక్షపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలేవీ లేవని సుప్రీం కోర్టు పేర్కొంది. అస్పష్టమైన, నిరాధార ఆరోపణలతో కూడిన పిటిషన్‌ను స్వీకరించలేమని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
…………


