అమెరికాలో హెచ్-1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠిన నిబంధనలపై పలు కార్మిక సంఘాలు, విద్యావేత్తలు, మత సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసేవారిపై లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించడాన్ని సవాలు చేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. ఈ వ్యాజ్యంలో సెప్టెంబర్ 19న డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రకటనలో అనేక తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు హెచ్-1బీ వీసా కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించిన వీసా పథకాన్ని దెబ్బతీసేలా, ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఇంత భారీ ఫీజును విధించడం అన్యాయమని ఫిర్యాదులో వివరించారు.ఈ లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా పునరుద్ధరణ చేసుకునేవారికి వర్తించదని వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది.


