2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. సెల్‌ఫోన్లు చూసుకొండి డబ్బులు వచ్చాయా, చూసుకున్నారా, కన్పర్మేషన్ మెసేజేలు అందుకున్నారా అని సీఎం ఆటో డ్రైవర్‌లని అడిగారు. అవును రూ.15 వేలు వచ్చాయని ఆటోడ్రైవర్‌లు సీఎంకు సమాధానం ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి వ్యవస్థలన్నీ అగమ్యగోచరమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగుచేశామని వివరించారు. స్త్రీశక్తికి ముందే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు.


