బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో సిద్దంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో తాము గెలుస్తామని పూర్తి నమ్మకం ఉందని, ప్రజలపై విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని ధ్వజమెత్తారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతోందని ప్రజలు కూడా ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉందన్నారు. విశ్వనగరం పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నగర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. వర్షం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితులు నగరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీ ఆర్ఎస్ జీన్స్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డలో కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికలు ఎలా కేటాయిస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ దేవాలయాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. నగరంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


