అవాస్తవాలు మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెలే, మాజీ మంత్రి టి. హరీశ్ రావుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. హనుమకొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదంటూ హరీశ్ రావుకు ఆయన హితవు పలికారు. బనకచర్లపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి పార్టీ వ్యతిరేకమని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రానికి ఇప్పటికే లిఖిత పూర్వక ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆలమట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా కూడా తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా చూస్తామని ఉత్తమ్ ప్రకటించారు. అయితే నీటి పంపకాల పంచాయతీలో మంత్రి హోదాలో హాజరైన ఏకైక వ్యక్తిని తానేనని ఉత్తమ్ గుర్తు చేశారు.


