బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఇండియా కూటమి ఎటూతేల్చిచెప్పకపోవడంతో అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఎంఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బిహార్‌లో 20 సీట్లలోపే పోటీ చేస్తూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు 100 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ కూటములకు ప్రత్యామ్నాయంగా తృతీయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తాము సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ తెలిపారు. పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), తేజస్వి యాదవ్‌కు తాము లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని అఖ్తరుల్ తెలిపారు. దీంతో తమ పార్టీ ఉనికికి మరింత విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, భావసారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.


