మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రుల కు సూచించింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లవ్ జిహాద్ పేరుతో మైనారిటీ యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ మీ కూతురు మీ మాట వినకుండా, మతం కాని వ్యక్తుల ఇళ్లలోకి వెళ్లేందుకు, వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకుపోకుండా కాపాడాలని అన్నారు. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటారని వ్యాఖ్యానించారు.
ఇంట్లో కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి, సంబరపడతామ ని ప్రజ్ఞా సింగ్ తెలిపారు. కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ప్రశ్నించారు. అలా ఇతర మతస్తుడిని కావాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆపడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర మతాల యువకులను తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని తల్లిదండ్రులను ప్రజ్ఞా సింగ్ కోరారు. పిల్లలకు మొదటి నుంచి విలువలను నేర్పించాలని సూచించారు. అయినప్పటికీ వారు మాట వినకపోతే, దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని అన్నారు. అలాంటి అమ్మాయిలకు గుణపాఠం చెప్పడం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.


