పురుషుల టెన్నిస్‌లో దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వీడ్కోలు తర్వాత కొత్త తారలు దూసుకొచ్చారు. వెటరన్ ప్లేయర్ అయిన నొవాక్ జకోవిచ్ ను నిలువరిస్తూ టైటిళ్లు పట్టేస్తున్నారు. అయితే జోకో నెలకొల్పిన అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డు మాత్రం బ్రేక్ చేయడం గగనమే. ఎందుకంటే ఇప్పటికైతే అతడికి దరిదాపుల్లో ఎవరూ లేరు. కానీ, కార్లోస్ అల్కరాస్ కు ఆ దమ్ముందని, అతడు జకోను అధిగమించి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తాడని అంటోంది మాజీ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్.
టెన్నిస్ ఆటలో స్పానిష్ వాళ్ల ఆధిపత్యం ఎప్పటి నుంచో ఉంది. ఇదివరకూ రఫెల్ నాదల్, ఇప్పుడు అల్కరాస్. ఈమధ్య కాలంలో ఈ యంగ్‌స్టర్ అద్భుత విజయాలతో అదరగొడుతున్నాడు. నేను అతడికి పెద్ద అభిమానిని. ప్రతిసారి మ్యాచ్‌కు ముందు అతడికి ఫోన్ చేసి విజయం సాధించాలని చెబుతాను అని సెరెనా వెల్లడించింది. జకోవిచ్ తన పేరిట రాసుకున్న అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డును బ్రేక్ చేసేది ఎవరు? అనే ప్రశ్నకు ఇంకెవరు మన అల్కరాస్ అని ఠక్కున చెప్పేసిందీ అమెరికా లెజెండ్. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న అతడు జకో రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇప్పటివరకూ అతడు ఆరు టైటిళ్లు సాధించాడు. ఇదే జోరు చూపిస్తే అతడికి రికార్డు బద్ధలుకొట్టడం కష్టమేమీ కాదు. ఎందుకంటే, టెన్నిస్‌లో ఏదైనా సాధ్యమేన’ని వివరించింది నల్ల కలువ.


