తమిళనాడు కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను విజయ్ నేడు కలిశారు.
మహాబలిపురం లోని ఓ రిసార్ట్‌లో బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. మృతులకు చెందిన 37 కుటుంబాలతో సహా 200 మందితో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కోసం టీవీకే దాదాపు 50 రూమ్స్‌ను బుక్ చేసింది. కరూర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు తరలించారు. అక్కడ వారితో విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతీ కుటుంబం నుంచి నాలుగు నుండి ఐదుగురు వ్యక్తులు విజయ్‌ను కలవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరినీ విజయ్ వ్యక్తిగతంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ భేటీకి మీడియా సహా ఇతరులను అనుమతించలేదు.


