ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు రాబోతోంది. ఆమె మరెవరో కాదు కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్. త్వరలోనే సినీ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నటన, డాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన జాన్వీ ఇప్పటికే కొన్ని కథలను విన్నట్టు సమాచారం. వాటిలో ఒక ప్రాజెక్ట్ కోసం అధికారిక ఒప్పందం కూడా పూర్తయిందని తెలుస్తుంది. త్వరలోనే ఆమె డెబ్యూ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేనికి హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. ఒకప్పుడు ఆమెను కథానాయికగా ప్రకటించినప్పటికీ, కృష్ణ అభిమానులు “ఆమెని మేము హీరోయిన్‌గా చూడలేం అంటూ వ్యతిరేకించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తరువాత మంజుల నిర్మాతగా, కొన్నిసార్లు నటిగా, అలాగే దర్శకురాలిగా కూడా ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి కొంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు అదే ఇంటి నుంచి మరో తరం తెరపైకి రావడానికి సిద్ధమవుతుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.


