రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్ల కు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని వెల్లడించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం రాష్ట్రపతి నివేదనపై సెప్టెంబర్ 11 నుంచి 10 రోజులపాటు విచారణ జరిపి తన అభిప్రాయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడమంటే రాజ్యాంగ అధికారాలను ధిక్కరించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని తెలిపింది. గవర్నర్లు బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని వివరించింది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


