బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కా్జ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హనుమకొండ లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ చేసిన మోసానికి బీసీలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని. హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? అంటూ అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. బీసీల జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్లు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ సర్కారును ఆయన సూటిగా ప్రశ్నించారు.


