తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దీక్షపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. దీక్ష పేరుతో కేసీఆర్ ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని, దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం చేశారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టులను కేటీఆర్‌కు పంపుతామని అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు వచ్చింది ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని తెలిపారు. కేసీఆర్ దీక్ష విరమిస్తే విద్యార్థులు పోరాటాన్ని కొనసాగించారని అప్పటి సంగతులను గుర్తుచేశారు.
విద్యార్థుల ఆవేదన చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. ఫ్లూయిడ్స్ తీసుకుని ఐరోమ్ షర్మిల 16 ఏండ్లు దీక్ష చేశారన్నారు. ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ కోట్లాది రూపాయలతో దీక్షా దివాస్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని, ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షా దివాస్‌ను పక్కన పెట్టి సోనియా గాంధీకి పాలాభిషేకాలు చేయాలని హితవుపలికారు. తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమని కేసీఆర్‌కు అర్థమైందని, అందుకే ఆయన బయటకు రావడం తెలిపారు.


