భారతీయ బియ్యం దిగుమతులపై అధిక టారిఫ్‌ను వసూల్ చేసేందుకు అమెరికా సర్కారు సిద్దమైంది. వ్యవసాయ దిగుమతులపై కొత్త పన్ను విధానాన్ని అమలు చేయనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంతో పాటు కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఫెర్టిలైజర్లపై కొత్త సుంకాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా రైతుల కోసం ట్రంప్ సర్కారు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో రైతు పెద్దలతో ట్రంప్ మాట్లాడారు. ఆ సమయంలో భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాలు అమెరికాకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. వ్యవసాయ దిగుమతుల వల్ల స్వదేశీ ఉత్పత్తిదారులకు సమస్యలు వస్తున్నట్లు రిపబ్లికన్ నేత చెప్పారు. అయితే ఆ సమస్యను పరిష్కరించేందుకు టారిఫ్ విధానాన్ని దూకుడుగా అమలు చేయనున్నట్లు చెప్పారు. వాణిజ్య పన్నుల ద్వారా సేకరించిన సుమారు 12 బిలియన్ల డాలర్ల నిధుల్ని అమెరికా రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్, వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ పాల్గొన్నారు.


