రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపునకు కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12,702 పంచాయతీలకు గానూ 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు సీఎం. 808 కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారని వివరించారు. దీంతో 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించిందన్నారు. 3,511 బీఆర్ఎస్, 710 బీజేపీ మొత్తంగా 33 శాతం గెలిచాయని పేర్కొన్నారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.


