తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి వచ్చే ఏడాది జూలై 31న జరగనున్న 19వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం తో అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు రావాలని కోరారు. అలాగే 19వ మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల రూపురేఖలను ముఖ్యమంత్రికి వివరించారు. యువత భాగస్వామ్యం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ ప్రశంసించారు. తెలుగు ఐక్యతను ప్రపంచ స్థాయిలో చాటేలా ఈ మహాసభలను నిర్వహించేందుకు సహకరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.


