మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని, ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతోత్సవాలు నిర్వహించారు. బీజేపీకి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్‌పేయి ముందు వరుసలో ఉంటారని కీర్తించారు. వాజ్‌పేయిని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ శిష్యుడిగా ఎంచుకున్నారని చెప్పారు. వాజ్‌పేయి పాలన అంటే సుపరిపాలన అని, యువతకు వాజ్‌పేయ్ ఆదర్శనం అన్నారు. తాను పదవి విరమణ మాత్రమే చేశానని,పెదవి విరమణ చేయలేదన్నారు. వాజ్‌పేయి చూపిన మార్గంలో నడుస్తున్నామా? లేదా? అనేది ప్రతీ కార్యకర్త ఆలోచించుకోవాలని సూచించారాయన. నైతిక పాలన, సామాజిక బాధ్యత, రాజ్యాంగం పట్ల అంకిత భావంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగితే అంకిత భావంతో పని చేసినట్లు కాదన్నారు. రాజకీయ నాయకులకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటు అయిపోయిందంటూ ప్రస్తుత నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


