డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పండుగల అప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని నిలదీశారు. అనేకమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా? ఏం చేశారని ప్రశ్నించారు. తమతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని, గతంలో నిందితులు వాంగ్మూలం ఇచ్చారు కదా అని గుర్తుచేశారు. నిందితుల వాంగ్మూలం ఆడియో, వీడియో రికార్డు చేశారని తెలిపారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు. అకున్ సబర్వాల్ ను డ్రగ్స్ కేసు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో స్టేట్మెంట్స్ను నాటి సీఎస్ సోమేశ్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారని ప్రస్తావించారు. గతంలో సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి? అని నిలదీశారు. సోమేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని అన్నారు.


