పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తన ఛాంబర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హరీష్‌రావును చూస్తుంటే గోబెల్స్‌ను కూడా మించిపోయారని ఆయన ఎద్దెవా చేశారు. హరీష్ ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా వాస్తవం లేదని, అన్నీ పచ్చి అబద్దాలేనని ఆయన దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డికి అన్యాయం చేసిన వారే ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌నని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు అంత అహంకారం ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు.ఎవరి హయాంలో ఏం జరిగిందో సాక్షాధారాలతో సహా సభలో బయటపెడతానని అన్నారు. కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేయగా, తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


