తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో గొప్పగా చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలుగా నీటి వాటాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు చేశారని గుర్తుచేశారు. అంతేకాదు తెలంగాణకు కేవలం 34 శాతం నీళ్లు సరిపోతాయని కేసీఆర్, హరీష్ రావులు అంగీకరించారని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో రూ.1.80 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని వెల్లడించారు.


