అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని దేశమంతా చూసిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నోత్తరాలలో సీఎం గంటన్నర సేపు మాట్లాడటం శాసన సభ చరిత్రలో లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా వాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టా రాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుకోవటం, హరీష్ రావును బాడీ షేమింగ్ చేయటం తప్ప సమాధానం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి నోట్లో మూసి కంపు పెట్టుకొని హరీష్ రావు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
స్పీకర్ కూడా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని మాట్లాడారని తెలిపారు. ఇదెక్కడి సభ, ఇదెక్కడి సంప్రదాయం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భజన చేయటానికి తాము అసెంబ్లీకి రావాలా అంటూ నిలదీశారు. అందుకే అసెంబ్లీని బహిష్కరించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా కనువిప్పు కలిగి వచ్చే శాసనసభా సమావేశాల్లో అయినా తమకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


