అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు. రాత్రికి రాత్రి వెనెజువెలా పై కమాండో దాడి జరిపి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా అమెరికాకు తరలించి ట్రంప్ తన పంతం నెరవేర్చుకున్నారు. అంతటితో ఆగని ట్రంప్, దక్షిణ అమెరికా దేశాన్ని మొత్తం తానే నియంత్రిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రభుత్వానికి ట్రంప్ కీలక హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. వెనెజువెలా కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు, చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్ విక్రయాల్లో అమెరికాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.


