పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్ ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే ఆయనను కించపరిచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అపాచీ హెలికాప్టర్ల సరఫరాతోసహా పెండింగ్‌లో ఉన్న రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలను చర్చించేందుకు భారత ప్రధాని మోదీ తనను వ్యక్తిగతంగా కలుసుకున్నారని ట్రంప్ తెలిపారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ తనకు, మోదీకి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం భారత్ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఐదేండ్లు గడిచినా భారత్‌కు ఆ హెలికాప్టర్లు అందలేదు. ప్రధాని మోదీ నన్ను కలిసేందుకు వచ్చారు. సర్.. మిమ్మల్ని కలవొచ్చా ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డారు. సరే కలుద్దామని చెప్పాను. మోదీతో నాకు మంచి అనుబంధం ఉంది అని ట్రంప్ వివరించారు. అయితే సుంకాలకు సంబంధించి మోదీ తన పట్ల సంతోషంగా లేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. భారీ సుంకాలు చెల్లిస్తున్న కారణంగా మోదీ తన పట్ల సంతోషంగా లేరని ఆయన చెప్పారు. పైగా భారత్ తమ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదని కూడా ఆయన తెలిపారు.


