గుంటూరుకు చెందిన హరి కృష్ణారెడ్డి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కృష్ణారెడ్డి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. క్రిస్మస్ సెలవులు రావడంతో అలాస్కాకు వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగానే హరి అలాస్కా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డెనాలి సమీపంలోని ఓ హోటల్‌లో బస చేశారు. తాను అలాస్కా పర్యటనకు వెళ్తున్నానని, జనవరి 3 లేదా 4న తిరిగి వస్తానని తన రూమ్మేట్స్‌కు చెప్పారు. ఒంటరిగా అలాస్కా వెళ్లిన తెలుగు విద్యార్థి, డిసెంబర్ 30న తన స్నేహితులతో చివరిసారిగా మాట్లాడారు. డిసెంబర్ 31 నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31నే హరి హోటల్ నుంచి చెక్ అవుట్ అయినట్లు సమాచారం.


